భదాద్రి సీతమ్మకు పట్టుపీతాంబరం – సిరిసిల్ల నేత కళాకారుడికి దక్కిన అవకాశం

సిరిసిల్ల చేనేత కళాకారుడు అద్భుతాన్ని ఆవిష్కరించారు. కాలక్రమేణా అంతరించిపోయిన పట్టు పీతాంబరాలకు తిరిగి జీవం పోశారు. పట్టు, వెండిపోగులతో కలిపి నేసిన పట్టు పీతాంరాన్ని
భదాద్రి సీతమ్మకు సమర్పించిన ఘనత మన నేతన్నదే. ఆ నేత కళాకారుడే వెల్ది హరిప్రసాద్‌. ‌గతంలోనూ ఈయన అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీరెను ఆవిష్కరించారు.

– చేనేతమిత్ర ప్రతినిధి

ఏటా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. అయితే ఈసారి సిరిసిల్ల పట్టణంలోని నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ ‌నేసిన పీతాంబరం పట్టుచీరను ప్రభుత్వం తరుపున అందజేస్తున్నారు. తాను తయారు చేసిన చీరను భదాద్రి సీతమ్మ వారికి ప్రభుత్వం తరుపున అందజేయాలని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారని హరిప్రసాద్‌ ‌తెలిపారు. చీర అద్భుతంగా ఉందని మెచ్చుకుంటూ..ఆయన సూచన మేరకు చీరెను దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ ‌కుమార్‌కు అందజేశానని చెప్పారు.

పట్టు పీతాంబరాలు ఒకప్పుడు ధనవంతుల ఇళ్లలోనే కనిపించేవి. కొంతమంది ఈ చీరలను స్టేటస్‌ ‌కోసం ధరిస్తే.. మరికొందరు పెళ్లిళ్లలో పెళ్లికూతురుకు అపురూప కానుకగా ఇచ్చేవారు. వందల ఏళ్ల క్రితం ఓ వెలుగు వెలిగిన పట్టు పీతాంబరాలు.. కాలక్రమేణా అంతరించిపోయాయి. తెలంగాణ సంస్కృతిలో భాగమైన పట్టు పీతాంబరాలను తిరిగి సృష్టించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ నేత పనిలో నైపుణ్యం, పీతాంబరాలను నేయడానికి అవసరమైన ఓపికతో పాటు పీతాంబరాల ధరను భరించే వారు కరువవ్వడంతో ఆ ప్రయత్నాలు నెరవేరలేదు.

అయితే చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న హరిప్రసాద్‌ ‌పట్టు పీతాంబరాలకు తిరిగి ప్రాణం పోశారు. ఇప్పటికే తన నేత పనితనంతో ఎన్నో అవార్డులు, చాలా మంది ప్రముఖుల ప్రశంసలు పొందిన వెల్ది హరిప్రసాద్‌ ‌మొదటిసారిగా సిరిసిల్లలో పట్టు పీతాంబరాలను మగ్గంపై నేసి అద్భుతాన్ని ఆవిష్కరించారు. గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో దూరే చీరను రూపొందించారు. ఇప్పటికే చేనేత మగ్గంపై పలు ప్రయోగాలు చేసి ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌ప్రశంసలు పొందిన హరిప్రసాద్‌ ‌తాజాగా భదాద్రికి సిరిసిల్ల చేనేత పట్టు పితాంబరం చీరను అందించడం విశేషం.

తొలి పట్టు పీతాంబరాన్ని సీతమ్మకు బహూకరించడం ఆనందంగా ఉంది.

‌పితాంబరం పట్టుచీరల తయారీ అంతరించిపోకుండా ఉండాలని ఉద్దేశంతో 20 రోజులపాటు కష్టపడి తయారుచేశా. 150 గ్రాముల వెండి పోగులతో తయారుచేసిన ఈ పట్టు చీర 750 గ్రాముల బరువు ఉంటుంది. ఈ చీర తయారీకి రూ.45 వేలు ఖర్చు అయ్యింది. తొలి పీతాంబరం పట్టుచీర సీతమ్మ వారి కల్యాణానికి అందజేయడం ఆనందంగా ఉంది. కూలీ తీసుకోకుండా కేవలం సీతమ్మవారికి సమర్పించాలనే లక్ష్యంతో చీర నేశా. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు పీతాంబరం పట్టుచీరలు కావలసినవారు తనను సంప్రదిస్తే (9440049734), వారి అభిరుచి మేరకు తయారు చేసి ఇస్తా.

– హరిప్రసాద్‌

చేనేతలు, అన్ని చేనేత ఉప కులాలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సభలు, సర్వసభ్య సమావేశాలు, సన్మానాలు, చేనేత కుల దైవాల ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలు తదితర విశేషాలను వాట్సప్‌ నంబర్‌ 8333871117కు పంపగలరని మనవి. వాటిని www.chenetamitra.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఒక్క క్లిక్‌తో మన వారిని సమాచారం తెలుస్తుంది. 

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

 

Twitter

Follow us on social media

Related posts

Leave a Comment