చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లలో ఈ నెల 13వ తేదీన నిర్వహించిన పద్మశాలీయుల రాజకీయ యుద్ధభేరికి కులస్థులు భారీ సంఖ్యలో విచ్చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో సభాస్థలికి చేరుకున్నారు. అక్కడే సెల్ఫీలు తీసుకున్నారు. అతిథులు ప్రసంగానికి ముందు, తర్వాత కొందరు పద్మశాలీ ప్రముఖులు తమ వాణిని సభకు వినిపించారు. తమ కార్యవర్గ సభ్యులతో ఫొటోలు తీసుకున్నారు. మొత్తంగా పద్మశాలీయుల కోరుట్ల యుద్ధభేరి విజయవంతమైంది.
ఆలేరు నుంచి పోటీచేస్తా: రాపోలు వీరమోహన్

జాతీయ చేనేత ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాపోలు వీర మోహన్ యుద్ధభేరి సభలో ప్రసంగించారు. తన కార్యవర్గంతో హాజరయిన ఆయన తాను ఎన్నికలలో పోటీచేస్తానని ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో దాదాపు 38 వేల మంది పద్మశాలీ ఓటర్లు ఉన్నారని, వారు తనను ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

హోరెత్తిన నినాదాలు..
తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పద్మశాలీయులతో సభాప్రాంగణం కిక్కిరిసింది. ప్రముఖులు, ముఖ్య అతిథుల మాటలు నూతనోత్తేజాన్ని నింపాయి. ప్రసంగాల మధ్యలో జై.. మార్కండేయ.. జై పద్మశాలీ అంటూ నినాదాలు చేశారు.
భారీ కటౌట్‌లు..ఫ్లెక్సీలు
సభా ప్రాంగణంలో భారీ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. సభకు విచ్చేస్తున్న పద్మశాలీయులకు స్వాగతం పలుకుతూ..దారి పొడవునా ప్రముఖుల ఫొటోలతో, పద్మశాలీ కులపెద్దలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు దర్శనిమిచ్చాయి.
అతిథులకు ఘన సన్మానం..
సభలో అతిథులను నిర్వాహకులను ఘనంగా సత్కరించారు. ముఖ్య ఆహ్వానితులను వేదిక మీదకు తీసుకెళ్లడం మొదలు.. చివరకు వారికి వీడ్కోలు పలికే వరకు దగ్గరుండి ఏర్పాటు చేశారు.


యుద్ధభేరి సభ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బస్వా లక్ష్మీనర్సయ్య వ్యవహరించగా.. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈరవత్తి అనిల్, పద్మశాలీ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీని వాస్, సాంబారి ప్రభాకర్, భోగ వెంకటేశ్వర్లు, భోగ శ్రావణి, గడ్డం మధు, జిల్లా ధనుంజయ్, జక్కుల ప్రసాద్, ముల్క ప్రసాద్, మార్త రమేశ్, అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika



