ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీ నిర్వహణకు మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుకా ఆర్థిక సాయం చేశారు. సెప్టెంబర్ 30వ తేదీ నిర్వహించిన టోర్నీకి రూ. 25వేలు చెక్కును జాతీయ అంధత్వ సంస్థ ప్రతినిధులు పుష్పరాజ్, అనిల్‌కు అందజేశారు. బుట్టా ఫౌండేషన్ తరపున తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని వారికి మాజీ ఎంపీ చెప్పారు.
టోర్నీని ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని
జాతీయ అంధుల సమాఖ్య ఆధ్వర్యంలో కర్నూలు స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డీఎస్పీ బాబా ఫకృద్దీన్, బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్, రగ్జీ కర్నూలు జిల్లా అధ్యక్షులు సురేందర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాస్ హాజరయ్యారు. ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ అంధులకు అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ భారత అంధుల క్రికెట్ జట్టులో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇప్పటి దాకా 10 మంది ప్రాతినిథ్యం వహించడం, అందులో కర్నూలు నుంచి ఇద్దరు ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ అంధత్వ సంస్థ ప్రతినిధి పుష్పరాజ్ మాట్లాడుతూ కర్నూలులో ఈ టోర్నీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో బుట్టా ఫౌండేషన్ తరపున చరిత, హేమలత, అంధుల క్రికెట్ జాతీయ సెలక్షన్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
విజేత విజయనగరం జట్టు
కర్నూలు నగర శివారులోని మాంటిస్సోరి ఇండస్ గురుకుల్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. విజయనగరం, కర్నూలు జట్లు తలపడ్డాయి. విజయ నగరం జట్టు మొదట బ్యాటింగ్ చేపట్టి 40 ఓవర్లకు 242 పరుగులతో ఆలౌటైంది. కర్నూలు జట్టు 20 ఓవర్లలో కేవలం 107 పరుగులు మాత్రమే తీసింది. డీఎస్పీ బాబా ఫకృద్దీన్, బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్, రగ్జీ జిల్లా అధ్యక్షులు సురేందర్ విజేతగా నిలిచిన విజయనగరం జట్టుకు ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో అంధుల భారత్ క్రికెట్ టీం క్యాబ్ కెప్టెన్ అజయ్ రెడ్డి, క్యాబ్ కెప్టెన్ డేవిడ్, బ్లైండ్ ఫెడరేషన్ కర్నూలు శాఖ ప్రతినిధులు అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు
మరిన్ని వార్తలు కర్నూలు జిల్లాలో వీక్షించవచ్చు
