కష్టపడి చదవడం కంటే ఇష్టపడి చదివితే లక్ష్యసాధన సులువని నిరూపించారు హరిత. విద్యావంతులయిన తల్లిదండ్రులు ఆమె ఇష్టానికి అనుగుణంగా నడుచుకున్నారు. డాక్టర్ కావాలన్న ఆమె ఆశయానికి పూర్తిగా సహకరించి ప్రోత్సహించారు. చివరకు లక్ష్యం చేరుకుని కన్నవారికి గుర్తింపు తెచ్చిపెట్టారు మంగళగిరికి చెందిన విద్యాకుసుమం డాక్టర్ హరిత.

కుటుంబ నేపథ్యం:
దామర్ల వీరాంజనేయులు మంగళగిరిలోని వీటీజేఎం, ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో ఉద్యోగి. ఝాన్సీరాణి మందడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్నారు. వీరికి కూతురు హరిత, కుమారుడు భరత్ సంతానం. చిన్నప్పటి నుంచి చదువులో రాణించిన హరిత తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అరవింద హైస్కూల్‌లో పదోతరగతి, విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో నిర్వహించిన ఎంసెట్ ఫలితాల్లో 64వ ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. ఎంబీబీఎస్ డిస్టింక్షన్‌లో పాసయ్యారు. 2016లో నిర్వహించిన పీజీ వైద్య ప్రవేశ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఓబీసీ కేటగిరీలో 61వ ర్యాంకు సాధించి న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అనస్థీషియా కోర్సు పూర్తి చేశారు. బ్యాచ్ టాపర్‌గా నిలిచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. పేపరు ప్రజెంటేషన్ ఇచ్చేందుకు జనవరి 5న లండన్‌లోని హెల్త్ యూనివర్సిటీకి వెళ్తున్నారు. తమ్ముడు భరత్ బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి ముంబయిలోని షాపూర్జీ, పల్లోంజీ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్టు మేనేజరుగా పనిచేస్తున్నారు.
పలువురి ప్రశంసలు :
డాక్టర్ హరిత పీజీలో గోల్డ్ మెడల్ సాధించడంపై డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ గోలి రామ్మోహనరావు, పట్టణంలోని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి ఆమెకు అభినందనలు తెలిపారు. మంగళగిరిలో సిద్ధమవుతున్న ఎయిమ్స్‌లో వైద్యసేవలు అందించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు డాక్టర్ హరిత. Ziskovum


