చేనేతలకు వడ్డీ లేని రుణాలివ్వాలి – తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు – రిలే దీక్షలకు సంఘీభావం తెలిపిన మ్యాడం బాబురావు

లాక్‌డౌన్‌ కారణంగా చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోన్న నేతన్నలకు ప్రభుత్వం వడ్డీలేని బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మ్యాడం బాబురావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి కేంద్రంలో చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు బాబురావు జులై 20వ తేదీ మద్దతు తెలిపారు. దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల ఆత్మహత్యలను పాలకులు నివారించలేకపోతున్నారని, నెలకు ఇద్దరి చొప్పున బలవన్మరణాలకు పాల్పడడం తనను తీవ్రంగా బాధిస్తోందన్నారు. మార్చి నుంచి డిసెంబరు వరకు ప్రతి చేనేత కార్మికుడికి రూ. 10 వేలను జీవన భృతిగా ఇవ్వాలన్నారు. జియో ట్యాగ్‌ ఉన్న ప్రతి మగ్గానికి రూ. 5 లక్షల వడ్డీ లేని బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ పద్మశాలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాస్‌ మాట్లాడుతూ చేనేత కార్మికులకు పనుల్లేక, తయారైన వస్త్రాలు కొనుగోళ్లకు నోచుకోక నేతన్నల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. చేనేతల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే  బాధ్యత వహించాలన్నారు. బతుకమ్మ చీరలు తయారీకి రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల కార్మికులకు పని కల్పించాలని అలాగే ఇల్లు లేని నిరుపేద చేనేత కార్మికుడికి డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంది శ్రీరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి, సెక్రెటరీ జయరాజ్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కోమటి సత్యనారాయణ, స్థానిక జిల్లా అధ్యక్షుడు చిక్క వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక అధ్యక్షులు తిరందాస్‌ ధనంజేయులు పాల్గొన్నారు. Γραμμή Fintrion

Follow us on social media

Related posts

Leave a Comment