సంఘటిత శక్తిగా ఎదిగి చేనేత సమాజ అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగాలని పలువురు చేనేత వర్గాల ప్రముఖులు పేర్కొన్నారు. ఆంధప్రదేశ్ వీవర్స్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఏపీ వెపా) ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అధ్యక్షులు కే వెంకట శేషయ్య సెప్టెంబర్ 9వ తేదీ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. గుంటూరు జిల్లా బాధ్యులు, చేనేత కవి రాపోలు జగన్ కాన్ఫరెన్సుకు సమన్వయ కర్తగా వ్యవహరించారు. వెపా నెల్లూరు జిల్లా అధ్యక్షులు సజ్జా వెంకట సురేష్ సంఘం ఆవిర్భావం, లక్ష్యాలు, సాధించిన విజయాలు, సభ్యత్వ వివరాలను విశదీకరించారు. రాత్రి 7 నుంచి 10.45 వరకు జరిగిన కాన్ఫరెన్సులో 13 జిల్లాల నుంచి చేనేత సమాజానికి చెందిన ప్రముఖులు, సభ్యులు దాదాపు 55 మంది పాల్గొన్నారు. సెప్టెంబర్ 9వ తేదీ 2018లో నెల్లూరు జిల్లా కేంద్రంగా ఏర్పడిన వెపాలో చేనేత సమాజానికి చెందిన అన్ని వర్గాల వారు కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. రెండేళ్ల కాలంలో ఎంతో ప్రగతిని సాధించారు. చాలామంది వెపా నుంచి ఎంతో సహాయ సహకారాలు పొందారు. ప్రస్తుతం వెపా ఇతర జిల్లాలకు విస్తరిస్తోంది.
ప్రముఖ్య న్యాయవాది వైకే వెపాకు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విశాల భావాలు, లక్ష్యాలు కలిగిన వెపాకు చేనేత వర్గాలన్ని అండగా ఉండాలని కోరారు. సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ముశ్శం అనంతరాములు మాట్లాడుతూ కరోనా లాక్‌డౌన్ వల్ల చేనేత నిల్వలు నేతన్నల ఇళ్లలో, మాస్టర్స్ వీవర్స్ వద్దే ఉండిపోవడం వల్ల వారికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తతెత్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. టవాళ్లు, బెడ్‌షీట్లు, వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేసేలా ఆయా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని చేనేత సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేశారు. పాలకులపై కూడా ఒత్తిడి తేవాలని కోరారు.
మంగళగిరి మునిసిపల్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ మనలో కొంతమంది కులం చెప్పుకోడానికి ఇష్టపడరని, ఇతర కులాల వారితో పోలిస్తే మనలో కలుపుగోలుతనం, చొరవ కాస్త తక్కువ అని అభిప్రాయపడ్డారు. ఉన్నతాధికారులు, ఉద్యోగులు తమ వద్దకు మన వారి సమస్యలు సత్కరమే పరిష్కారం అయ్యేందుకు మార్గం చూపాలని కోరారు. సంఘం కేవలం నెల్లూరు జిల్లాకు పరిమితం కాకుండా మిగతా జిల్లాలో విస్తరించడం అభినందనీయమన్నారు.
తెలంగాణ సచివాలయ ఉన్నతోద్యోగి తిరందాసు యాదగిరి మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లోని సెక్రటేరియట్‌లలో చేనేత వర్గాలకు న్యాయమైన పనులు త్వరగా అయ్యేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
నెల్లూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఐక్యత లోపిస్తే ఏ వర్గానికి గుర్తింపు రాదన్నారు. ఐక్యంగా ఉంటేనే సామాజికంగా బలంగా ఉంటామన్నారు. వ్యక్తిగత ఎదుగుదల కంటే సామూహిక ఎదుగుదల అవసరమన్నారు.

పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా లాక్‌డౌన్ వల్ల నేత కార్మికులు, ఇటు మాస్టర్ వీవర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం ఉత్పన్నం కాకుండా సమన్వయం చేయాలని కోరారు. ఆప్కోలో అవినీతి ఎక్కువైందని ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో చేనేత వర్గాలకు కేటాయించిన స్థలాలను తిరిగి ప్రభుత్వం వెనక్కు తీసుకునేందుకు యత్నిస్తోందని, దీన్ని చేనేత వర్గాలన్నీ తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రభాకర్ రావు మాట్లాడుతూ లాక్‌డౌన్ సమయంలో చేనేత కుటుంబానికి సాయం చేశామన్నారు. సంఘం అన్ని జిల్లాలో విస్తరించడం శుభపరిణామన్నారు. వచ్చే ఏడాది భారీ రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.
మాచర్ల పాపారావు మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ చేనేత కార్మికుడు చనిపోతే ఆయనకు ప్రభుత్వం నుంచి వచ్చే వాటి గురించి చేనేతలకు సరైన అవగాహన లేదన్నారు. వివిధ సంక్షేమ పథకాల గురించి చేనేతలకు పూర్తిగా తెలిసి ఉండాలన్నారు. వాటిని తెలియజెప్పేందుకు టీంగా ఏర్పడి పనిచేయాలన్నారు.
డా. మేరువ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ సారి వార్షికోత్సవాన్ని చేనేతల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట నిర్వహించాలని కోరారు. కార్పస్ ఫండ్ సమకూర్చుకోవాలన్నారు. ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించాలన్నారు. లీగల్ సెల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఉపాధ్యాయుడు గుర్రం వెంకటరమణ మాట్లాడుతూ మన బలం ఎక్కువ ఉన్న చోట కూడా శాసనసభ్యుడిగా పోటీ చేయకపోవడం బాధాకరమన్నారు.
కర్నూలు నుంచి పోపా సభ్యులు నారాయణ కేశవయ్య, జేరుబండి హరిప్రసాద్ మాట్లాడుతూ చేనేత సమాజంలోని అన్ని వర్గాల వారితో ఏర్పడిన వెపా కార్యవర్గానికి జిల్లాలో తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత వర్గాల డేటా సేకరణ, ముఖ్యంగా ప్రభుత్వ శాఖల వారీగా చాలా ముఖ్యమన్నారు. నిరుద్యోగుల వివరాలు తెలుసుకుని వారికి ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించాలన్నారు. చేనేతల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు.
చివరగా తాటిపర్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా కార్యాలయంలో రెండు మాసాలకోసారి కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తుంటామన్నారు. అత్మీయ సమావేశాలు, ప్రతిభా పురస్కారాలకు సభ్యుల పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయన్నారు. తమ సంఘంలో 20 ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. వందన సమర్పణతో వీడియో కాన్ఫరెన్సు ముగించారు.

కాన్ఫరెన్సులో అడ్వకేట్ చిలువేరు మార్కండేయులు, వాసుదేవమూర్తి, గుర్రం వెంకటరమణ, శ్రవణ్ కుమార్, బూదాటి బాలకోటేశ్వరరావు, చింతగింజల జ్యోతి, శ్రీహరి ప్రసాద్, కోడూరు శివకుమార్, జి. మోహన రావు, తుమ్మచెర్ల వెంకటేశ్వర్లు, తాటిపర్తి వెంకటేశ్వర్లు, భాస్కర మూర్తి, శ్రీహరిబాబు, కొణిశెట్టి లక్ష్మయ్య, వై. వీరశేఖర్, పురం వెంకటేశ్వర రావు, పి బాలసుబ్రహ్మణ్యం, కేవీ రావు, శీలం మల్లికార్జున, తిరువీధుల లీలా మాధవ రావు, తెల్లప్రోలు వాసుదేవమూర్తి, ఎన్ అప్పారావు, కటకం సాంబశివరావు, బట్టు రవీంద్రబాబు, సతీష్, పళ్లా మాలకొండయ్య , గుర్రం చిన్న వీరయ్య, మునగపాటి చలపతిరావు, విజయమోహన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. Liman Dexeris

