చేనేత సమాజం నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు

మ్మెల్సీలుగా చేనేత వర్గానికి చెందిన మరో ఇద్దరు ఎన్నికయ్యారు. అధికార వైసీపీ నుంచి పోతుల సునీత, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.

ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం పోలింగ్‌ ‌జరిగింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 7 స్థానాలను అధికార వైసీపీ దక్కించుకోవాలనుకుంది. అయితే ఒక స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనురాధ 23 ఓట్లతో ఘన విజయం సాధించారు. గెలుపునకు 22 ఓట్లు అవసరం కాగా అనురాధకు ఏకంగా 23 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె విజయం ఖరారైంది.

కార్పొరేటర్‌ ‌నుంచి మేయర్‌ ‌దాకా..

తొలుత కార్పొరేటర్‌గా పనిచేసిన అనురాధ 2000 సంవత్సరంలో విజయవాడ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ‌సీటు బీసీ మహిళకు రిజర్వ్ ‌కావడంతో మేయర్‌ ‌టికెట్‌ ‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉన్నత చదువులు చదువుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు టికెట్‌ ‌ఖరారు చేయడంతో మేయర్‌గా ఎన్నికయ్యారు. 26 సంవత్సరాల వయసులోనే మేయర్‌గా ఎన్నికకావడంతో అనురాధ పేరు లిమ్కా బుక్‌ ఆఫ్‌ ‌రికార్డస్‌లో నమోదైంది. 2005 వరకూ విజయవాడ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌గా పనిచేశారు.

వాస్తవానికి చేనేత సామాజిక వర్గానికి చెందిన అనురాధకు 2015లోనే ఎమ్మెల్సీ పదవి దక్కాల్సి ఉంది. అయితే ఆమెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నామినేషన్‌ ‌వేసేందుకు పత్రాలు లేకపోవడంతో చివరి నిమిషంలో ఆ ఎమ్మెల్సీ సీటును ప్రతిభాభారతికి కేటాయించారు. పదవులను ఆశించకుండా చాలా సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న అనురాధకు టీడీపీ అధినేత చంద్రబాబు 2016-18 మధ్య కాలంలో ఆంధప్రదేశ్‌ ‌మహిళా కో-ఆపరేటివ్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌ ‌లిమిటెడ్‌ ‌చైర్‌పర్సన్‌గా నియమించారు. ప్రస్తుతం ఆమె టీడీపీ జనరల్‌ ‌సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ అనురాధ చురుకుగా పాల్గొన్నారు. పద్మశాలీ ఇంటర్నేషనల్‌ ‌వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (‌పీవా) వ్యవస్థాపక సభ్యులుగా కూడా ఉన్నారు.

కుటుంబ నేపథ్యం..

పంచుమర్తి అనురాధ తల్లిదండ్రులు స్వర్గం పుల్లారావు, లక్ష్మి. తండ్రి ఇన్‌కంటాక్స్ ‌డిపార్డుమెంట్‌లో జాయింట్‌ ‌కమిషనర్‌గా పనిచేసి రిటైరరయ్యారు. తల్లి లక్ష్మి గృహిణి. అనురాధకు అక్క, తమ్ముడు ఉన్నారు. అనురాధ భర్త శ్రీధర్‌, ‌పారిశ్రామిక వేత్త. వీరికి ఒక కూతురు సంతానం.

వరుసగా మూడోసారి పోతుల సునీత

ఎమ్మెల్సీగా వరుసగా మూడోసారి అవకాశం దక్కించుకున్నారు పోతుల సునీత. ప్రసుత్తం ఈమె వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. తొలుత 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత.. మరో మూడేళ్లు సమయం ఉండగానే ఆమె పదవికి రాజీనామా చేశారు. అయితే 2021 ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ఆమెకు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. పదవీకాలం 2023 మార్చితో ముగియనుండగా.. మరోసారి ఎమ్మెల్సీగా బరిలో నిలపడంతో విజయం సాధించారు.

పోతుల సునీత గతంలో టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్‌ ‌టీడీపీలోకి వచ్చారు.. దీంతో అక్కడ విభేదాలు భగ్గుమన్నాయి. ఆ వెంటనే చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2019 ఎన్నికలకు ముందు ఆమంచి వైఎస్సార్‌సీపీలో చేరగా.. ఆమె మాత్రం టీడీపీలో కొనసాగారు. కానీ కొద్దిరోజుల తర్వాత అనూహ్యంగా మూడు రాజధానుల బిల్లుకు సంబంధించి శాసన మండలిలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. అనంతరం సీఎం జగన్‌ను కలిసి మద్దతు తెలిపారు. దీంతో టీడీపీ అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేసిన క్రమంలో సునీత తన పదవికి రాజీనామా చేశారు. అయితే జగన్‌ ఆమెకు మళ్లీ అవకాశం ఇచ్చారు.

ముగ్గురు ఎమ్మెల్సీలు మనవాళ్లే..

మునుపెన్నడూ లేని విధంగా.. చేనేత సమాజానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడంతో చేనేత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే మాజీమంత్రి మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్సీ (వైసీపీ)గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా అధికార పార్టీ నుంచి పోతుల సునీత, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి అనురాధ విజయం సాధించారు.

చేనేతలు, అన్ని చేనేత ఉప కులాలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సభలు, సర్వసభ్య సమావేశాలు, సన్మానాలు, చేనేత కుల దైవాల ఆలయాల్లో జరిగే పూజ కార్యక్రమాలు తదితర విశేషాలను వాట్సప్‌ నంబర్‌ 8333871117కు పంపగలరని మనవి. వాటిని www.chenetamitra.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఒక్క క్లిక్‌తో మన వారిని సమాచారం తెలుస్తుంది. 

చేనేతమిత్ర మాసపత్రిక 

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika

Evitraps

Follow us on social media

Related posts

Leave a Comment