హైదరాబాద్: నేత నేయడం తప్ప మరో పని తెలియని మారుమూల గ్రామమది. అక్షరజ్ఞానం అంతంత మాత్రమే. చదువుకుంటే ప్రయోజకుడివి అవుతావు అని చెప్పేవారు కూడా లేని రోజులవి. అయితే కసితో చదివారు. ఇంగ్లీషు భాషపై పట్టుసాధించారు. డిగ్రీ ఆపై ఎన్నో కోర్సులు పూర్తిచేసి.. బెంగళూరులోని సీఎంకే ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ (టెక్నికల్) స్థానానికి ఎదిగిన మహోన్నత శిఖరం మేరువ వేంకటేశ్వర్లు.

ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) సభ్యునిగా ఎంపికయ్యారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, వినియోగదారుల హక్కులకు రక్షణ కల్పించడం RERA ముఖ్యోద్దేశం. విజయవాడ కార్యాలయంలో సెప్టెంబర్ 17న ప్రమాణ స్వీకారం చేసిన మేరువకు పలువురు పద్మశాలీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మేరువ వెంకటేశ్వర్లు ‘‘చేనేతమిత్ర’’తో చాలా విషయాలు పంచుకున్నారు.

విద్యాభ్యాసం..
1963వ సంవత్సరం అక్టోబరు 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా నారాయణవరం మండలం తుంబూరు గ్రామంలో జన్మించిన మేరువ వెంకటేశ్వర్లు..స్వగ్రామంలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. గ్రామం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమంగళం (సౌత్) హైస్కూల్‌లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివారు. టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ విద్య కోసం నెల్లూరు వెళ్లారు. అప్పట్లో ఇంగ్లీషు మీడియం చదవాలంటే అక్కడ మాత్రమే అందుబాటులో ఉండేది. చదువు కోసం తల్లిదండ్రులు, స్నేహితులను వదిలి బీసీ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ పూర్తి చేశారు. రెండేళ్ల హాస్టల్ జీవితం.. తనకు ఎన్నో బతుకు పాఠాలు నేర్పిందంటారు మేరువ వెంకటేశ్వర్లు..
‘‘అవాంతరాలను అధిగమించా..’’
‘‘హాస్టల్‌లో సరైన భోజనం ఉండేది కాదు. నేలపైనే నిద్ర.. దోమలతో సహవాసం..కష్టమంటే ఏమిటో తెలిసేలా చేసింది. జీవితంలో గెలవడమంటే సులువు కాదని అర్థమైంది. ఇంటర్మీడియట్ ఇంగ్లీషు మీడియం కావడంతో మొదట్లో చాలా ఇబ్బంది పడ్డా. చెప్పేవారు కూడా చాలా అరుదు. నాకు లైబ్రరీకి వెళ్లే అలవాటుండేది. అక్కడే పలు రకాల ఇంగ్లీషు పుస్తకాలు చదువుతూ ఆంగ్లంపై పట్టు సాధించా. ఇంటర్ పూర్తి చేశా. మా దూరపు బంధువొకరు వీఆర్ కాలేజీలో లెక్చరర్‌గా ఉండేవారు. ఆయన సూచన మేరకు 1987లో తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్‌లో ఉన్న ఎన్ బీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరా. సివిల్ ఇంజనీరింగ్ ఫస్టు క్లాసులో పాసయ్యా. ఉద్యోగాన్వేషణలో భాగంగా చెన్నై చేరా. అక్కడ ప్రముఖ కాంట్రాక్టు కంపెనీలో సైట్-ఇంజనీర్‌గా చేరా. KWMC (కోయంబేడు హోల్ సేల్ మార్కెట్)లో విధులు నిర్వహించా. అక్కడ నుంచి మొదలు.. విదేశాల్లో పనిచేసేందుకు కూడా నాకు ఆఫర్లు వచ్చాయి. ఎంతో అనుభవం గడించాక..బెంగళూరులోని ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ కంపెనీలో డైరెక్టర్ (టెక్నికల్) స్థానానికి ఎదిగా.’’ అని వివరించారు మేరువ వెంకటేశ్వర్లు.
వ్యక్తిగత జీవితం..
మేరువ వెంకటేశ్వర్లుకు 1989లో కనక దుర్గతో పెళైంది. ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తిచేసిన ఆమె గతంలో కుప్పంలో గవర్నమెంట్ టీచర్‌గా కొనసాగారు. ఐదున్నరేళ్ల సర్వీసు ఉండగానే VRS తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు లహరి ఎంటెక్ చదివారు. అల్లుడు చెన్నయ్ ఐఐటీలో పీజీ చేశారు. ‘సైంటిస్ట్ ఎఫ్’ గా AERB ముంబైలో పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు-గహన్, నయానికా. చిన్న కుమార్తె బిటెక్ ఆర్కిటెక్చర్ పూర్తి చేశారు. ప్రస్తుతం మేరువ కుటుంబం బెంగళూరులో ఉంటోంది.

డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా..
మేరువ వెంకటేశ్వర్లుకు విద్యపై ఎంతో మక్కువ. అందుకే ఒకవైపు ఉద్యోగం చేస్తూనే..ఎన్నో డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు పూర్తి చేశారు. వాటిలో కొన్ని..
- పుణెలో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్..
- కొలంబో, శ్రీలంక దేశం నుంచి నిర్మాణరంగంలో డాక్టరేట్..
- ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్‌లో ఏక్సెలరేటెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం..
- చెన్నైలో పర్సనాలిటీ ఫ్యాక్టర్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించారు.
ఎన్నో సంస్థల్లో సభ్యత్వం..
- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో జీవితకాల సభ్యత్వం
- నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సభ్యత్వం
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాల్యూయర్స్ (ఐఓయూ)లో జీవిత కాల సభ్యత్వం
- ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్‌లో జీవితకాల సభ్యత్వం
- పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యత్వం
- కర్ణాటక హైకోర్టు అండ్ కర్ణాటక ఆర్బిట్రేషన్ సెంటర్‌లో టెక్నికల్ ఆర్బిట్రేటర్ సభ్యత్వం కూడా ఉంది.
‘శ్రీమతి ప్రోత్సాహంతోనే..’
జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం వెనక తన శ్రీమతి సహకారం చాలా ఉందంటారు మేరువ వెంకటేశ్వర్లు.. ‘‘మాకు పెళై 36 ఏళ్లయ్యింది. నా భార్య కనకదుర్గ నా ప్రతిపనిలోనూ అండగా ఉంటుంది. పిల్లలకు చదువులు చెప్పడంలో ఆమె బిజీగా ఉన్నా.. ఆమె సహకారం నాకు ఎప్పుడు ఉంటుంది. నేను ఈ స్థాయికి ఎదగడానికి ఆమె కారణం’’
సామాజిక సేవలో..
నారాయణవరం మండలం తుంబూరు గ్రామ యువజన సంస్థలో సభ్యుడిగా ఉన్న మేరువ వెంకటేశ్వర్లు పాలకమండలిలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేశారు. పచ్చదనం-పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ గ్రామంలో శ్రమదానం చేశారు. IRDS (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ) అనే స్వచ్ఛంద సంస్థలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. గ్రామీణ పేద విద్యార్థుల ఉన్నత చదువులకు సాయపడ్డారు. భూమి సాగుకు రైతులకు ఆర్థిక సాయం చేశారు. ఇటీవల ఆయన చదివిన హైస్కూల్‌లో మొక్కలు నాటారు. స్వగ్రామంలో వెనుకబడిన వర్గాల జీవనోపాధికి ఆవులను కొని ఇచ్చారు. స్వగ్రామంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులతో శిబిరాలు ఏర్పాటు చేయించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
రంగస్థల నాటకాలలో నటించడం హాబీగా ఉన్న మేరువకు.. చాణక్య మోనో-యాక్షన్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన నటనకు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. వృత్తిపరంగా ఎన్నో శిఖరాలు అధిరోహించిన మేరువ వెంకటేశ్వర్లు జీవితం ఆదర్శనీయం.



