వ్యాపారరీత్యా మరో చోట ఉన్నా.. సొంతూరుపై ఆయనకు ఎంతో మమకారం. పుట్టి పెరిగిన ఊరికి చేతనైనంతా సాయం చేయాలన్న తపన ఆయనది. తల్లి ఇచ్చిన స్ఫూర్తితో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వృద్ధులు, పేదలు, వికలాంగుల ఆకలి తీరుస్తున్నారు. ఆధ్యాతిక్మ చింతనతో పలు దేవాలయాలకు ఆర్థిక సాయం చేశారు. ఆయనే రామ శ్రీనివాస్. తాజాగా పద్మశాలీయుల అభ్యున్నతి, ఐక్యత కోసం తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం (టీఆర్‌పీఎస్) ఏర్పాటు చేశారు.
‘‘మోక్షారామం ఫౌండేషన్’’ స్థాపన ఎలా జరిగిందంటే..
వరల్డ్ పద్మశాలీ క్లబ్ (డబ్ల్యూపీఎస్) రూపకర్త అయిన రామ శ్రీనివాస్ వరంగల్ జిల్లా రామన్నపేటలో 1964లో జన్మించారు. అయితే వ్యాపారరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తల్లి ఇచ్చిన స్ఫూర్తితో.. సొంత గ్రామానికి సేవ చేయాలనే తపనతో.. వరంగల్ నగరంలో ఏప్రిల్ 2016లో భార్య రామా శోభారాణితో కలిసి ‘‘మోక్షారామం ఫౌండేషన్’’ను స్థాపించారు. అనంతరం రామన్నపేటలో ‘‘అమ్మ ఒడి’’ పేరిట 3 అంతస్థుల భవనం నిర్మించి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.
ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యకమ్రాల్లో కొన్ని..
1. వరంగల్ రామన్నపేటలోని శ్మశానవాటికను దత్తత తీసుకున్నారు. దానికి మోక్షారామం గార్డెన్‌గా నామకరణం చేసి నాలుగేళ్లు శ్రమించి 3000 మొక్కలను నాటి ఉద్యానవనంగా తీర్చిదాద్దారు. పేదలు కర్మకాండలు నిర్వహించుకునేందుకు వీలుగా రెండు రూములున్న రెండు ఇళ్లను నిర్మించడంతో పాటు పిల్లల కోసం ఆట స్థలం, ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేశారు.
2. అన్నపూర్ణ నిత్యాన్నదాన కార్యక్రమం కింద అమ్మఒడి భవనంలో పేద వృద్ధులు, వికలాంగులు సుమారు 200 మందికి రోజూ రెండు పూటలా భోజనం వడ్డిస్తున్నారు. నడవలేని వారికి వలంటీర్ల ద్వారా వారి ఇంటికి భోజనం పంపుతున్నారు. అమ్మఒడి భవనం మొదటి అంతస్థులో స్థానిక ప్రజలు శుభాకార్యాలు నిర్వహించుకునేందుకు వీలుగా మినీ ఫంక్షన్ హాల్ నిర్మించారు. రెండో అంతస్థులో ఫౌండేషన్ కార్యాలయం ఉంటుంది. ఇక్కడి నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో అంతస్థులో యువకుల కోసం ఉచితంగా జిమ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అమ్మఒడి భవనం ప్రాంగణంలో స్థానిక ప్రజలకు మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేశారు. స్థానికుల ఇళ్లలో శుభకార్యం ఉంటే ఉచితంగా స్టీలు, పింగాణి ప్లేట్లు, గ్లాసులు తదితర వంట సామగ్రిని వాడుకుని తిరిగి వాటిని తెచ్చిపెట్టే అవకాశం కల్పించారు.
3. కరోనా సమయంలో వేల సంఖ్యలో వలస కూలీలు, పేదలు, భిక్షాటకులకు ఆహార పొట్లాలు పంపిణీ చేయించారు. విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి కూడా ఆహారాన్ని సమకూర్చారు. చుట్టుపక్కల గ్రామాల్లోని పేదలకు 62 రోజుల పాటు సుమారు 50వేల ఫుడ్ ప్యాకెట్స్ అందజేశారు.
4. ఫౌండేషన్ సభ్యులు తయారుచేసిన 3.5 లక్షల మాస్కులను ప్రజలకు, పోలీసు శాఖ సిబ్బందికి ఇచ్చారు.
5. 2017లో వరంగల్ మున్సిపాలిటీకి చెత్త సేకరణ నిమిత్తం 400 రిక్షాలు సమకూర్చారు. అలాగే రామన్నపేటలో 4000 తడి, పొడి చెత్త డబ్బాలను ఇంటింటికి పంపిణీ చేయించారు.
6. పేద కుటుంబాల్లో వివాహాలకు పుస్తే, మెట్టెలు, చీర అందజేశారు.
7 దేవాలయాల అభివృద్ధికి ఆర్థిక సాయం చేశారు. అయోధ్యలో నిర్మిస్తోన్న రామమందిర నిర్మాణానికి రూ. 25 లక్షలు చెక్కును అంజేశారు. ఇటీవల దుబాయిలో హిందూ దేవాలయానికి రూ.1,11,116 విరాళం ఇచ్చారు. భద్రాచలం పద్మశాలీ అన్నసత్రంలో గది నిర్మాణానికి రూ. 8 లక్షలు అందజేశారు. మోక్షారామం పౌండేషన్ సేవా కార్యక్రమాల్లో గత 6 సంవత్సరాలుగా సుమారు 100 మందికి పైగా వలంటీర్లు పాలుపంచుకుంటున్నారు.



రామ శ్రీనివాస్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి జగదీశ్వర్ రెడ్డి

రాజకీయాలకు అతీతంగా రామ శ్రీనివాస్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గతంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మెచ్చుకున్నారు. ప్రజల కోసం సేవ చేయాలనుకునే వారు, స్వచ్ఛంధ సంస్థలు మోక్షారామం ఫౌండేషన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.

లోగో ఆవిష్కరణ:
టీఆర్‌పీఎస్ లోగోను రామ శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. తొలిరోజు 71 మంది సభ్యత్వం తీసుకున్నారు.

![]()
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika




