అభ్యుదయ చేనేత సమాజానికి కృషి చేస్తా: పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌

చేనేత సమాజాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని ఆంధప్రదేశ్‌ పద్మశాలీ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ జింకా విజయలక్ష్మి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి బీసీల పట్ల ఎంతో అభిమానం ఉందన్నారు. చేనేతలకు విడివిడిగా 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం..నేత కార్మికుల పట్ల ఆయనకు ఉన్న ప్రత్యేక అభిమానానికి నిదర్శనమని పేర్కొన్నారు.

పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌, డైరెక్టర్లను గుంటూరు జిల్లా, నగర పద్మశాలీ సంక్షేమ సంఘం నాయకులు నవంబర్‌ 29వ తేదీన గుంటూరులోని ప్రగడకోటయ్య భవన్‌లో సన్మానించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనుముల నాగ ప్రసాద రావు స్వాగతోపన్యాసం చేశారు. వెంకటగిరికి చెందిన మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ మాడా జానకిరామయ్య భావనారుషి స్తోత్రము పఠన అందరిని ఆకట్టుకుంది. ప్రజాబంధు ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించాక పలువురు వక్తలు ప్రసగించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి హనుమంతరావు మాట్లాడుతూ అర్హులైన నేత కార్మికులందరికి సంక్షేమ పథకాలు వర్తించేలా చూడాలని చైర్‌పర్సన్‌ను కోరారు. నిబద్ధతతో పనిచేసి భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ఆమెకు అభినందనలు తెలిపారు.

కన్నా విద్యాసంస్థల అధినేత కన్నా మాస్టర్‌ మాట్లాడుతూ గుజ్జనగుండ్లలోని ప్రగడ కోటయ్య భవన నిర్మాణం, అలాగే పేద విద్యార్థుల కోసం నిర్మిస్తున్న హాస్టల్‌ భవనం కూడా మధ్యలో ఆగిపోయాయని తెలిపారు. వాటిని పూర్తి చేసేందుకు దాతలు ఆర్ధిక సాయం చేయాలని కోరారు.

చేనేత కవి రాపోలు జగన్‌ మాట్లాడుతూ పద్మశాలీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కోసం వందల మంది పోటీపడ్డా.. ఆ పదవి జింకా విజయలక్ష్మిని వరించిందని పేర్కొన్నారు. పద్మశాలీ సమాజంలోని చేనేత పేద కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని, వారి అభ్యున్నతికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

వెంకటగిరికి చెందిన డైరెక్టరు నక్కా వెంకటేశ్వరరావు  మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆశయాలకు అనుగుణంగా పద్మశాలీలను అన్నిరకాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు. అనుముల నాగ ప్రసాద రావు మాట్లాడుతూ చేనేతలు మరింత బలపడాలన్నారు. ఐక్యత దిశగా ముందుకు సాగాలన్నారు.

కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ధర్మన్న మాట్లాడుతూ చైర్‌పర్సన్‌, డైరెక్టర్లను ఒకే వేదిక మీద సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. డైరెక్టర్లు ఒకరినినొకరు పరిచయం చేసుకునే అవకాశం కల్పించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

మేడం సుంకన్న మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలీయుల మరింత బలోపేతం కావాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పద్మశాలీయులందరికి వర్తించేలా చూడాలన్నారు. అనంతరం జీవి నాగేశ్వరరావు, ఉడతా పెద్దన్న, గోలి వెంకటేశ్వరరావు, గాజుల సత్యనారాయణ, నాగేశ్వరరావు, రామనాధం పరమేశ్వరరావు, యంగల శ్రీధర్‌, జంజనం వెంకటేశ్వర్లు, యంగల లక్ష్మీ కాంతారావు, పారెపల్లి రామకృష్ణ, గుర్రం చిన వీరయ్య, హనుమంతరావు, ముస్యం వెంకటేశ్వర్లు, రంగారావు ప్రసంగించారు.

అనంతరం చైర్‌పర్సన్‌ జింకా విజయలక్ష్మిని, డైరెక్టర్లు వెంకటేశ్వరరావు, పారేపల్లి విజయలక్ష్మి, గోరంట్ల ధర్మన్న, ఆకుల కళ్యాణి, గోలి కుమారి, జాగు సూర్యచంద్రరావు, జంజనం అర్చన, కన్నె మడుగు సురేంద్రనాథ్‌లను జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన పద్మశాలి ప్రతినిధులు సన్మానించారు.

చివరగా చేపూరి రంగారావు వందన సమర్పణతో సన్మాన కార్యక్రమం ముగిసింది.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Wealthicator

Follow us on social media

Related posts

Leave a Comment