-
- పీవా సేవలు అభినందనీయం: కర్నూలు ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్
చేనేత కార్మికులకు సబ్సిడీ లోన్లు ఇవ్వాలి : పీవా రాష్ట్ర అధ్యక్షుడు స్వర్గం పుల్లారావు
ఘనంగా పీవా పదవ వార్షికోత్సవం
- పీవా సేవలు అభినందనీయం: కర్నూలు ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్
పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీవా) పదో వార్షికోత్సవాన్ని ఇటీవల విజయవాడలోని తుమ్మల పల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, పద్మశాలీ ప్రముఖులు హాజరయ్యారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ్‌కుమార్, ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మ, విజయవాడ నగర మాజీ మేయర్ పంచమర్తి అనూరాధ జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాన్ని ప్రారంభించారు.
నాయకత్వ లోపమే వెనుకబాటుకు కారణం
”పద్మశాలీయుల్లో నాయకత్వ లోపం ఉంది. అందుకే రాజకీయంగా ఎదగలేకపోతున్నాం. సమస్య ఉత్పన్నమయినపుడు ప్రజాప్రతినిధుల దగ్గరకు ఒకరో, ఇద్దరో కాకుండా సామూహికంగా వెళ్లాలి. అప్పుడే పరిష్కారం లభిస్తుంది. పరస్పరం సహకరించుకుంటూ సంఘటితంగా ముందుకు వెళితే రాజ్యాధికారం దక్కుతుంది. కుల సంఘాల్ని నామినేటెడ్ పద్ధతిలో కాకుండా శాస్త్రీయ పద్ధతిలో ఎన్నుకోవాలి. పీవా పేద పద్మశాలీ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం, స్కాలర్షిప్లు ఇవ్వడం, పేదలకు వైద్య సాయం చేస్తోంది. నిజంగా పీవా సేవలు అభినందనీయం. వారి సేవలు ఇంకా విస్తరించాలి. నేను పార్లమెంట్ సభ్యుడిని కాకముందు సంఘం తరపున మాజీ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లా. పెద్దగా స్పందించలేదు. తర్వాత అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశా. వెంటనే ఆయన ఏం కావాలని అడిగారు. ప్రజాభిమానంతో ఎంపీగా గెలిచా. ఈ మధ్యనే చేనేతలకు లబ్ధి చేకూర్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీశా. మీ ముఖ్యమంత్రి ఏడాదికి రూ. 24 వేలు ఇస్త్తున్న పథకానికి మించినవేమీ లేవన్నారు. ఆప్కో సంస్థను ప్రక్షాళన చేయాలి. దీనిపై సీఎంతో మాట్లాడాను.”
-డాక్టర్ సంజీవ్‌కుమార్, పార్లమెంట్ సభ్యులు, కర్నూలు నియోజకవర్గం.
పద్మశాలీయుల అభ్యున్నతికి కృషి చేయాలి
ప్రభుత్వం ప్రతి చేనేత కార్మికుడికి హామీ లేకుండా రూ. లక్ష సబ్సిడీతో రూ. 2 లక్షల వరకు రుణం మంజూరు చేయాలి. చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పద్మశాలీయుల అభ్యున్నతికి కృషి చేయాలి. ఇక పీవా విషయానికొస్తే చేనేతల కుటుంబాలకు విద్య, వైద్యపరంగా చేయూతనివ్వడమే మా లక్ష్యం. అసోసియేషన్‌లో 2300 మంది సభ్యులు ఉన్నారు. గత పదేళ్ల నుంచి రూ. 1.30 కోట్ల మూలధనంపై వచ్చే వడ్డీతో సంఘ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. దేశ, విదేశాల్లో ఉన్న పద్మశాలీయులు కూడా కులస్తుల అభ్యున్నతికి కృషి చేయాలి. చేనేతల సమస్యలను ఎప్పటికపుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. వారి సంక్షేమానికి కృషి చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతాం.
– స్వర్గం పుల్లారావు, పద్మశాలీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు
- పీవా కార్యదర్శి విన్నకోట వెంకటేశ్వర రావు( కన్నా మాస్టారు), కోశాధికారి నీలి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు, విజయవాడల మధ్య కులస్థులు ఎవరైనా 15 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇస్తే సంఘ భవనాన్ని నిర్మించి, దానికి దాత పేరు పెడతామన్నారు. పాస్‌పోర్టు అధికారి డీఎస్ఎస్ శ్రీనివాస రావు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పద్మశాలీ విద్యార్థుల కోసం పీవా తరుపున ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ బి రాధాకృష్ణ మాట్లాడుతూ చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లపై ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించడం అభినందనీయమన్నారు. అనంతరం పీవా నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యకమ్రంలో అఖిల భారత పద్మశాలీ సంఘం గౌరవాధ్యక్షులు జి. రామ్మూర్తి, అధ్యక్షుడు శ్రీధర్ సుంకుర్వార్, మాజీ మంత్రి ఎం. హనుమంతరావు , పీవా కోశాధికారి నారాయణ, జిల్లా అధ్యక్షులు శిరోమణిరావు, కార్యదర్శి బుల్లాబాయి, పీవా చీరాల, మంగళగిరి, గుంటూరు, కృష్ణ, తెనాలి, హైదరాబాద్, భట్టిప్రోలు శాఖల నుంచి సభ్యులు హాజరయ్యారు.
పీవా తీర్మానాలివి..
చట్టసభల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలి. ఎన్నికల్లో తగినన్ని సీట్లు కేటాయించాలి. ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి ప్రత్యేక ఆరోగ్య బీమా కార్డులు ఇవ్వాలి. Kuu Arvostus


