చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం (టీఆర్పీఎస్) ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో కోరుట్ల’’ కార్యక్రమం విజయవంతమైంది. రాజ్యాధికార సాధనే లక్ష్యంగా జగిత్యాల జిల్లాలో నిర్వహించిన ‘‘పద్మశాలీ రాజకీయ యుద్ధభేరి’’కి విశేష స్పందన లభించింది. సుమారు లక్షకు పైగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పద్మశాలీయులు సభకు తరలివచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా భారీ సంఖ్యలో హాజరుకావడం.. పద్మశాలీయుల ఐక్యతను రుజువు చేసింది. పలువురు పద్మశాలీ రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు సభకు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. వారి ప్రసంగాలు పద్మశాలీయుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి.


పద్మశాలీయులు అమెరికాలో ఉన్నా.. ఆస్ట్రేలియాలో ఉన్నా.. కోరుట్లలో ఉన్నా.. వారంతా నా ఆత్మీయులే. పద్మశాలీయులు చాలా చైతన్యవంతులనడానికి ఈ సమావేశమే నిదర్శనం. మానవుడి మానాన్ని కాపాడిన నేతన్నల బతువులు మరమగ్గాల ప్రవేశంతో దుర్భరంగా మారాయి. నేతన్నల అభ్యున్నతికి ప్రభుత్వాలతో పోరాడాలి.
రాజకీయంగా పద్మశాలీయులకు తగిన ప్రాధాన్యం లేదు. రాజకీయ పార్టీల్లో పద్మశాలీలపై వివక్ష ఉంది. న్యాయపరంగా మనకు చాలా దక్కాల్సి. వాటి కోసం మనమంతా కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలి. రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో రాణించాలనుకుంటున్న యువతను ప్రోత్సహించాలి. రానున్న ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న చోట పద్మశాలీ అభ్యర్థులను నిలబెట్టాలి. వారికి మాత్రమే మన ఓట్లు వేసేలా కులస్థులను కోరాలి.
ఏపీలో చేనేత ఉపకులాల జనాభా దాదాపు 30 లక్షలు మంది ఉన్నారు. చేనేత కుటుంబాల ఇబ్బందులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆయన ప్రతి మగ్గానికి రూ. 2వేలు పింఛన్ అందజేసేలా ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే నాలుగు చేనేత కార్పొరేషన్లు మంజూరు చేశారు. చేనేతలకు ప్రయోజనం చేకూరాలని ఇటీవల పార్లమెంట్లో నేషనల్ కమిషన్ ఫర్ వీవర్స్ వెల్ఫేర్, వీవర్స్ వెల్ఫేర్ అధారిటీ బిల్లులను ప్రవేశపెట్టాను.
-కర్నూలు ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ కుమార్


పద్మశాలీయుల ప్రభంజనానికి ఈ సభే నిదర్శనం. చైతన్యానికి ప్రధానం చదువు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. అన్ని రంగాల్లో పద్మశాలీయులు ఉండాలి. రాజకీయాల్లో రాణించాలన్న తపన ఉన్న యువతను ప్రోత్సహించాలి. చట్ట సభల్లో పద్మశాలీయులు ఉండాలి. మా నాన్న టైలర్. మొదట నేనొక ఇంజనీర్. గ్రూప్ 1 పరీక్షకు సిద్ధమై ఐఏఎస్ అధికారినయ్యా. చదువుకునే పిల్లలను ప్రోత్సహించాలి. ఉన్నత శిఖరాలను చేరుకోడానికి సహకరించాలి.
– ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి


స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం వచ్చాక.. చేనేత పరిశ్రమలో, సమాజాన్ని శాసిస్తున్న రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాం. పోషిస్తున్నాయో తెలుసుకోవాలి. పద్మశాలీ బిడ్డలు కార్యోన్ముఖులు కావాలి. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చేనేత సమాజం ఒత్తిడి తేవాలి. కరీంనగర్లో నేతన్న బజార్‌ను సాధించుకోగలిగాం. పద్మశాలీయుల అభ్యున్నతికి పాటుపడతా. పద్మశాలీయులు మరింత ఐకమత్యంగా ఉండి, జాతి ఔనత్యాన్ని కాపాడాలి.
-ఎమ్మెల్సీ ఎల్ రమణ


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎంతో కీలకం. తొలిదశ, మలిదశ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత రాజకీయాల్లో రాణించాలి. పద్మశాలీయుల అస్థిత్వాన్ని కాపాడుకునే సమయం ఆసన్నమైంది . నేతలుగా ఎదిగినపుడే నేతన్నల బతుకులు బాగుపడతాయి. మన వాణి పాలకులకు వినిపించగలం.
– గుండు సుధారాణి,
వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్


పద్మశాలీయులు రాజకీయంగా ఎదిగేందుకు రానున్న రెండు మాసాలు కీలకం. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆలోగా పద్మశాలీయులంతా తమతమ పట్టణాల్లో, గ్రామాల్లో వారానికి ఒకసారి సమావేశం కావాలి. అరగంట పాటు చర్చించుకోవాలి. భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలి.
– రాపోలు ఆనంద భాస్కర్, రాజ్యసభ మాజీ ఎంపీ
24 నియోజకవర్గాలు పద్మశాలీయులకు కేటాయించాలి

పద్మశాలీయులకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం దక్కాలి. ఎన్నికలు ఏవైనా..బలం, బలగం ఉన్న చోట పద్మశాలీయులు నిలబడాలి. పద్మశాలీయులు ఓట్లు కేవలం పద్మశాలీ అభ్యర్థికే వేయాలి. గెలిపించు కోవాలి. 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పద్మశాలీయులకు పార్టీ టికెట్లు ఇవ్వాలి. వీలుకాని పక్షంలో ఎమ్మెల్సీ పదవి, కార్పొరేషన్ చైర్మన్లుగానైనా చేయాలి. చేనేతవృత్తిపై ఆధారపడ్డ పద్మశాలీయులు కేవలం 5 శాతం మాత్రమే. మిగతా 95 శాతం మంది వివిధ వృత్తులో కొనసాగుతున్నారు. కేవలం 5 శాతం మందిని మాత్రమే కాకుండా.. 100 శాతం పద్మశాలీయులను ప్రభుత్వం ఆదుకోవాలి. పద్మశాలీ చరిత్రలో ఇంతమంది ఒకే చోట గుమిగూడడం ఇదే ప్రధమం.
-రామ శ్రీనివాస్, టీఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika


