ఆపన్న హస్తం కోసం..భర్త అనారోగ్యంతో కన్నుమూత – పిల్లల భవిష్యత్తుపై ఆందోళన – ఉపాధి కోసం ఎదురుచూపు

కడదాకా తోడుంటాడనున్న భర్త అనారోగ్యంతో అర్ధాతరంగా  కన్నుమూశాడు. సంపాదన అంతంతే. కూడబెట్టిన డబ్బు కాస్తా భర్త వైద్యానికి ఖర్చయ్యింది. పెద్దల ఆస్తులు లేవు. ఉన్నదల్లా అప్పు చేసి కట్టుకున్న రేకుల ఇల్లు. వికలాంగురాలు కావడంతో మగ్గం నేయడం ఆమెకు సాధ్యంకాదు. పెద్దదిక్కు లేని లోటు మనోవేదనకు గురిచేస్తుంది. అత్తామామ కూడా చనిపోయారు. తొమ్మిదేళ్ల కూతురు, ఐదేళ్ల కొడుకును ఎలా పెంచి పెద్దచేయాలో దిక్కుతోచని అయోమయ స్థితి ఆమెది. నిస్సహాయ స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న సాదు లక్ష్మి దీనగాధ ఇది.

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం చంగల వీధిలో నివాసం ఉన్న సాదు నాగరాజు (32) వృత్తిరీత్యా చేనేత కార్మికుడు. వస్త్ర వ్యాపారులు ముడి సరుకు ఇస్తే చీరనేసే ఇచ్చేవారు. నెలకు మూడు, నాలుగు చీరెలు నేసేవారు. సుమారు రూ. 6 వేల దాకా మిగిలేది. చాలీచాలని ఆదాయం కుటుంబ ఖర్చులకే సరిపోయేది. భార్య లక్ష్మి వికలాంగురాలు. చిన్నపుడు రోడ్డు ప్రమాదంలో ఎడమ కాలు దెబ్బతింది. పాదం సరిగా లేదు. మగ్గం నేయడం వీలుకాక భర్తకు సహాయకారిగా ఉండేవారు. ఈ క్రమంలో నాగరాజుకు ఊపిరితిత్తులో నీరు చేరడంతో (న్యూమోనియా) అనారోగ్యం బారినపడ్డారు. కుటుంబసభ్యులు తొలుత బత్తనపల్లె ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లి చూయించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ కార్పొరేట్‌ ఆసుప్రతికి తీసుకెళ్లి కొన్ని రోజుల పాటు చికిత్స చేయించారు. అక్కడ దాదాపుగా రూ. 50 వేలు  ఖర్చయ్యింది. నాగరాజుకు వచ్చిన జబ్బుకు ఆరోగ్య శ్రీ పథకం వర్తించదని డాక్టర్లు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. డబ్బులు లేకపోవడంతో కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల పాటు వైద్యం చేసి ఇంటికి పంపారు. సుమారు 20 రోజుల తర్వాత నాగరాజు పక్షవాతానికి గురయ్యారు. వెంటనే అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో డిసెంబర్‌ 22వ తేదీ చనిపోయారు. నాగరాజుకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి పేరు ఈశ్వరి. వయసు 9 సంవత్సరాలు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతోంది. కొడుకు ఈశ్వర్‌. వయసు 5 సంవత్సరాలు. 1వ తరగతి చదువుతున్నాడు.

స్పందించిన హృదయాలు

ఉరవకొండలోని దేవాంగ కుల సంఘం నాయకులు లక్ష్మి దీన స్థితిని కులపెద్దల దృష్టికి తీసుకెళ్లారు. లక్ష్మికి చేతనైనంత ఆర్థిక సాయం చేయాలని వారు కులస్థులకు వాట్సప్‌ గ్రూపుల ద్వారా సమాచారం పంపారు. చాలామంది స్పందించారు. ఆర్థికసాయం చేసుందుకు ముందుకు వచ్చారు. ఏఐడీడీకేకేఎఫ్‌ జాతీయ కార్యదర్శి, సౌత్‌ ఇండియా ఇన్‌చార్జి డీకే నాగరాజు రూ. 50 వేలు, విదేశాలలో ఉంటున్న మచ్చా నిరంజన్‌కుమార్‌ రూ. 25వేలు, శక్తి గ్రూఫ్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అధినేత దొంతంశెట్టి మనోహర్‌ రూ. 10 వేలు, అనంతపురం జిల్లా తాడిపత్రి దేవాంగ సంక్షేమం సంఘం రూ. 5 వేలు,  పశ్చిమ  గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన అల్లంకి నాగేశ్వరరావు, సోదరులు రూ. 3 వేలు, రూ. వెయ్యి చొప్పున గిద్దలూరి సుబ్బు , బత్తుల ప్రసాద్‌, ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిల్లపాలెకు చెందిన గుండ్లపల్లి నాగరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన దొంతు మురళి, ధర్మవరం సత్య శిల్స్క్‌ బొమ్మన వెంకటరమణ, విజయనగరం జిల్లాకు చెందిన ఉప్పు గిరధర్‌ రావు రూ. 516 సాయం చేశారు.

ఉపాధి చూపితే రుణపడి ఉంటా…

ఆదుకోడానికి అత్తామామ లేరు. చాలా ఏళ్ళ క్రితం చనిపోయారు. మా మామ పేరిట చంగల వీధిలో ఉన్న స్థలంలో పొదుపు మహిళ గ్రూపు నుంచి వచ్చిన రూ. 50లు, మగ్గాల లోన్‌ కింద రూ. 50 వేలు అప్పు తెచ్చి రేకుల ఇల్లు కట్టుకున్నాం. అప్పు ఇంకా కట్టాల్సి ఉంది. మా ఆయన చనిపోయాడు. అప్పు ఎలా కట్టాలో..పిల్లల్ని ఎలా పోషించాలో అర్థంకావడం లేదు. నేను పదో తరగతి పాసయ్యాను. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. పంటలు బాగా పండకపోవడంతో డబ్బులు లేక ఇంటర్మీడియట్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అంగవైకల్య శాతం తక్కువగా ఉందని నాకు పింఛన్‌ రాలేదు. తెల్ల రేషన్‌ కార్డే మాకు ఆధారం. 20 కిలోల బియ్యం వస్తాయి. మా అమ్మ చనిపోయింది. నాన్న అన్న దగ్గర ఉంటున్నాడు. నాకు మగ్గం పని రాదు. ఎక్కడైనా ఉపాధి చూపితే చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటా. – సాధు లక్ష్మి

ఆర్థిక సాయం చేసే వారి కోసం..

లక్ష్మి బ్యాంకు ఖాతా వివరాలు..

ACCOUNT HOLDER NAME : SADHU LAKSHMI
BANK : ANDHRA BANK
ACCOUNT NO: 195510100113781
IFSC CODE: ANDB0001955
URAVAKONDA.
CELL : 9492343270

Liman Finthra Hangi Bankalarda Var

Follow us on social media

Related posts

Leave a Comment