చైతన్యం దిశగా అడుగుల పడాలి: మాజీ ఎంపీ – నేషనల్‌ ప్రెస్‌ డే సందర్భంగా వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న రాపోలు ఆనంద భాస్కర్‌

పద్మశాలీయులు మరింత సంఘటితమై చైతన్యం దిశగా అడుగులు వేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్‌ ఆకాంక్షించారు. ఫలితంగా రాజకీయాల్లోనూ సత్తా చాటగలమన్నారు. సందర్భానుసారంగా వీలైనన్ని సమాచార మాధ్యమాల ద్వారా పద్మశాలీయుల గొప్పదనం, సంఖ్యాబలాన్ని సమాజానికి చూపాలని, ఇందులో పాత్రికేయుల పాత్ర కీలకమన్నారు. జాతీయ పాత్రికేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 17వ తేదీ ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ తరహా సమావేశాలు కనీసం నెలకు ఒక్కటైనా నిర్వహించాలని సూచించారు.

అఖిల భారత పద్మశాలీ సంఘం యువజన విభాగం అధ్యక్షులు, మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు గుండేటి శ్రీధర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు పద్మశాలీ ప్రముఖులు పాల్గొన్నారు. సమాజంలో పాత్రికేయుల పాత్ర అలాగే పద్మశాలీయుల అభ్యున్నతికి పద్మశాలీ విలేఖరుల తీసుకోవాల్సిన చొరవ గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.

చరిత్ర పరిశోధకులు, విమర్శకులు, రచయిత, ప్రొఫెసర్‌ సంగిశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడుతూ 1952 సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆరుగురు బీసీలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా అందులో ముగ్గురు పద్మశాలీయులు ఉన్నారని గుర్తు చేశారు. సిద్ధిపేట నియోజకవర్గంలో పెండెం వాసుదేవ్‌ పద్మశాలీ మాడపాటి హనుమంతరావును ఓడించారని, ఇది ఐక్యతకు నిదర్శనమన్నారు.

అఖిల భారత పద్మశాలీ సంఘం ఉపాధ్యక్షులు కందగట్ల స్వామి మాట్లాడుతూ సామాజిక వర్గాల్లో చిన్న చిన్న బేధాభిప్రాయాలు ఉండడం సహజమన్నారు. వాటిని పక్కనబెట్టి ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. చైతన్యం తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమన్నారు. సేవాభావంతో ముందుకు వచ్చి చురుకుగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తే వారు నాయకులుగా తయారవుతారని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో పద్మశాలీయుల అభ్యున్నతి కోసం నిర్ధిష్ట ప్రణాళికతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

చేనేత కవి, మార్కండేయ మాసపత్రిక ఎడిటర్‌ రాపోలు జగన్‌ మాట్లాడుతూ విద్య,ఉపాథి, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో చేనేతలు వెనకబడి ఉన్నారన్నారు. సంఖ్యాబలం ఉన్నా ప్రజాప్రతినిధులు కాకపోవడం బాధాకరమన్నారు. ఐక్యత సాధిస్తే అవకాశాలు వాటంతట అవే తలుపు తట్టుతాయన్నారు. చేనేత సమాజం బలమైన సామాజిక వర్గంగా తయారు కావాల్సిన సమయం అసన్నమైందన్నారు.

ప్రముఖ విద్యావేత్త, సీనియర్‌ పాత్రికేయులు కట్టేకోల రామదాసు మాట్లాడుతూ యితర సామాజిక వర్గాల్లో ఉన్నట్లుగానే మనలో కూడా ఐక్యత రావాలన్నారు. పద్మశాలీయుల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కనీసం 30 నియోజకవర్గాలో గెలిచే అవకాశాలున్నాయన్నారు. జూమ్‌ మాధ్యమ సమావేశాలు ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, యువకులతో తరుచుగా నిరంతరం నిర్వహించడం ద్వారా చైతన్యం, ఐక్యతకు బీజం పడుతుందన్నారు. పద్మశాలీయుల అభ్యున్నతికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు.

అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం అధ్యక్షులు యర్రమాద వెంకన్న మాట్లాడుతూ అందరిని కలుపుకోగల స్వభావం ఉన్న వారు రాజకీయాల్లో రాణిస్తారని, అలాంటి వారికి ఆర్థిక తోడ్పాటు, సలహాలు ఇచ్చే వాళ్లు కూడా ఉండాలన్నారు. పద్మశాలీయుల అభ్యున్నతికి ఒక అజెండాతో ముందుకు పోవాలన్నారు. మన ఉనికిని నిత్యం చాటుకునేందుకు మన సామాజిక వర్గానికి చెందిన పాత్రికేయుల సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కాన్ఫరెన్సు మధ్యాహ్నం 12.45 గంటలకు ముగిసింది. కాన్ఫరెన్సులో చేనేత జ్యోతి పక్షపత్రిక ఎడిటర్‌ గోళ్ల నరేందర్‌, సత్య న్యూస్‌ ఎడిటర్‌ గోలి విజయ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నవారందరికి గుండేటి శ్రీధర్‌ ధన్యవాదాలు తెలిపారు.

website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika Zlatá Era

Follow us on social media

Related posts

Leave a Comment