చేనేతమిత్ర ప్రతినిధి, హైదరాబాద్: త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావదానం ఇటీవల కెనడాలో ఘనంగా జరిగింది. పద్మాకర్ గారి అష్టావధానంతో తెలుగు సాహితీ కాంతులు కెనడాలో వెల్లివిరిసాయి.

పద్మాకర్ గారు ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ప్రవచానాలు, ఒక అష్టావధానం, ఒక శతావధానం నిర్వహించారు. తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలోని దుర్గా దేవి గుడిలో నిర్వహించిన అష్టావధానం ఆద్యాంతం ఆకట్టుకుంది. చమత్కార సంభాషణతో మొదలైన సభ, చివరకు సభ్యుల నవ్వుల జల్లులులో ముంచెత్తింది.


చాలా సంవత్సరాల తరువాత అవధాన ప్రక్రియను ప్రత్యక్షంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు అష్టావధానానికి హాజరయిన సీనియర్ సిటిజన్లు. తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉందని, దాన్ని తెలుసుకోవడం తమ అదృష్టమని యువత సంతోషం వ్యక్తం చేశారు.

‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా చక్కటి తెలుగు మా ప్రాణప్రదం, తల్లి భూమి భారతిని గౌరవించడమే జాతికి నిండుతనం అన్న భావంతో తెలుగు తల్లి కెనడా నెలకొల్పబడింది . తెలుగుతల్లి కెనడాను 1963లో శ్రీమతి సరోజ కొమరవోలు ప్రారంభించారు. 2016లో వెబ్ మ్యాగజైన్‌గా రూపుదిద్దుకుంది. కెనడాలో సంగీతం, సాహిత్యం, నృత్యంలో ప్రతిభావంతులైన తెలుగువారిని ఒకచోట చేర్చేందుకు తెలుగుతల్లి కెనడా కృషి చేస్తోంది.’’
– లక్ష్మి రాయవరపు,
తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకురాలు

“కెనడాలోని తెలుగువారిలో సాహిత్యాభిరుచి పెంచే ఉద్దేశ్యంతో 14 సంవత్సరాల క్రితం తెలుగు వాహిని స్థాపించబడింది. భావుకత పెంచి.. ప్రఖ్యాత విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయులు రచించిన ఆముక్తమాల్యద నుంచి నేటి యుగపు వచన కవిత్వం రాయించే పూచి మాది.”
-త్రివిక్రం సింగరాజు
తెలుగువాహిని అధ్యక్షులు

‘‘ఒంటారియోలో ఉంటున్న తెలుగువారికి అవసరమైర సాయం చేసి, తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాన్ని కాపాడడమే ఓటీఎఫ్ ముఖ్యోద్దేశం. సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు వారి అభ్యున్నతికి తోడ్పడేందుకు మా సంస్థ కృషి చేస్తోంది.’’
-మురళి పగిడేల
ఒంటారియో తెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు

వద్దిపర్తి దంపతులకు సన్మానం
అష్టావధాన కార్యక్రమం ముగిశాక సభ్యులంతా కలిసి వద్దిపర్తి పద్మాకర్ దంపతులకు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.

నిర్వాహకులను అభినందించిన పద్మాకర్
అష్టావధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా సంస్థల నిర్వాహకులను ఈ సందర్భంగా వద్ధిపర్తి పద్మాకర్ గారు ప్రశంసించారు. ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ సాహితీసదస్సు తెలుగు భాషాప్రియులకు కన్నులపండుగ అని పలువురు కొనియాడారు.

అష్టావధానం అంటే ఏమిటి?
అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాషలోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ – వీటన్నిటినీ ఏక కాలంలో – అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
వద్దిపర్తి పద్మాకర్ గారి గురించి క్లుప్తంగా..

వద్దిపర్తి పద్మాకర్ గారు 1966, జనవరి 1న పశ్చిమ గోదావరి జిల్లా, జోగన్నపాలెంలో వద్దిపర్తి చలపతిరావు, శేషమణి దంపతులకు జన్మించారు. తెలుగు, సంస్కృత భాషలలో ఎం.ఎ. చేశాడు. హిందీ భాషలో సాహిత్యరత్న పట్టాను పొందారు. బీ.ఈడీ శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఏలూరులోని సి.ఆర్.రెడ్డి (కట్టమంచి రామలింగారెడ్డి) కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా చేరి 1993 నుండి 2004 వరకు పనిచేశారు.
ఈయన 1225కి పైగా అష్టావధానాలను, 11 శతావధానాలను, 1 త్రిభాషా సహస్రావధానం చేశారు. 756 పద్యాలను ఏకబిగిన 207 నిమిషాలలో ధారణ చేసిన ప్రతిభాశాలి. అంతేకాక 90 నిమిషాలలో 180పద్యాలను ఆశువుగా చెప్పగలిగిన కవి. ఏలూరు, విశాఖపట్నం, తాడేపల్లిగూడెం, చల్లపల్లి, గుంటూరు, రాజమండ్రి, నరసరావుపేట, హైదరాబాదు, సికిందరాబాదులతో పాటు సింగపూరు, అమెరికా వంటి దేశాలలో కూడా అవధానాలను చేశారు. ఆగ్రాలోని హిందీ డైరెక్టరేట్‌లో హిందీలో అవధానం చేసి మెప్పించారు.
![]()
చేనేతమిత్ర మాసపత్రిక
website : www.chenetamitra.com
whatsapp Number: 83338 71117
e mail: chenetamitra@gmail.com
click here to join facebook : chenetamitra Maasapatrika


