చేనేతమిత్ర ప్రతినిధి, చీరాల: చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేస్తోంది. డిమాండ్ల సాధనకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో భాగంగా జూన్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని పిలుపునిచ్చింది. ధర్నా అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయాలని సూచించింది.
ఇవి డిమాండ్లు ..
1) నిల్వవున్న చేనేత వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
2) చేనేతకు 11 రకాల వస్త్రాల రిజర్వేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు జరపాలి. ఉల్లఘించిన వారిపైన చట్టం (1985) ప్రకారం చర్యలు తీసుకోవాలి.
3) ‘‘నేతన్న నేస్తం’’ పథకాన్ని ప్రతి చేనేత కార్మికుడికి (షెడ్ల చేనేత కార్మికులకి, ఉపవృత్తుల కార్మికులకి) వర్తింప చేయాలి.
4) చేనేతపైన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి..
5) రాష్ట్రప్రభుత్వం 2023`24 వార్షిక బడ్జెట్లు రూ. 2,60,868 (2 లక్షల 60 వేల 868) కోట్లలో చేనేతకు రూ. 200 కోట్లు మాత్రమే కేటాయించారు. రూ. 5 వేల కోట్లు కేటాయించాలి.
6) కేంద్ర ప్రభుత్వం 2023`24 వార్షిక బడ్జెట్ రూ. 45,03,097 (నలభై ఐదు లక్షల 3 వేల 97) కోట్ల బడ్జెట్లో చేనేతకు రూ. 200 కోట్లు మాత్రమే కేటాయించారు. 25 వేల కోట్లు కేటాయించాలి.
7) విద్యా సంస్థలతో సహా, అన్ని ప్రభుత్వ సంస్థల్లో చేనేత వస్త్రాలనే వినియోగించాలి.
8) నూలు, పట్టు, జరి, రంగులు, రసాయనాల ధరలు 2021 నాటి స్థాయికి తగ్గించాలి.
9) చేనేత సహకార సంఘాలకు చెల్లించవలసిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి.
10) ఆప్కో ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలి. నెల్లూరులో 7 ఎకరాల ఆప్కో స్థలం ఆప్కోకే దక్కాలి. అన్యాక్రాంతానికి సహకరించిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి.
డిమాండ్ల సాధన కోసం జరుగనున్న ధర్నా కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, సహకార సంఘాల బాధ్యులు, మాస్టర్ వీవర్లు, చేనేత శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.
![]()
చేనేతమిత్ర మాసపత్రిక Lithuanian Invest
