
ఏపీ వీవర్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నెల్లూరు శాఖ వారి ఆధ్వర్యంలో ప్రగడ కోటయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. నగరంలోని లక్ష్మీపురం ప్రాంతంలోని సంఘం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శేషయ్య మాట్లాడుతూ చేనేతల సంక్షేమమే ప్రగడ కోటయ్య లక్ష్యమని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. కోటయ్య పార్లమెంటు సభ్యులుగా ఉన్న సమయంలో చేనేత సహకార సొసైటీలను ఏర్పాటు చేయటంలో విశేష కృషి చేశారని గుర్తు చేశారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేనేతల ఐక్యత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.చేనేత సమాజం ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చేనేత వర్గాల మీద ఉందన్నారు. చేనేత వస్త్రాలను కొని చేనేత కార్మికులను ఆదుకోవాలని ప్రజలను కోరారు. సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు సజ్జ వెంకట సురేష్ మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7 న) రోజున కార్యక్రమంలో పాల్గొనే ప్రతి సంఘ సభ్యుడు విధిగా చేనేత వస్త్రాలను ధరించి, చేనేతలకు చేయూతనందించే కార్యక్రమానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. అదే రోజు చేనేత స్టాళ్లను ఏర్పాటు చేస్తామని, చేనేత వస్త్రాలు కొని వినియోగాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డి బాలకోటేశ్వర రావు, కోశాధికారి బడతల ప్రభాకర్, సహ కార్యదర్శి చల్లా రంగారావు, లీగల్ సెల్ కార్యదర్శి వెంకట ప్రసాద్, పెద్దలు దివి వెంకయ్య,లక్ష్మీకాంతం,చంద్రశేఖర్,పెంచలయ్య పాల్గొన్నారు. Kruvestal


