కర్నూలు ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్ మే 18వ తేదీ తన కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన పలు సమస్యలపై మాట్లాడారు.

‘‘ఆదోని డివిజన్‌లోని మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి, కౌతాళం, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల, ఆదోని, ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, గూడూరు ప్రాంతాల నుంచి దాదాపు 3వేల మంది ముంబాయికి వలస వెళ్లారు. అక్కడ కూలి పనులు చేసుకుంటూ చిన్న చిన్న గుడిసెల్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం వారికి తిండి దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. వలస కూలీల పూర్తి సమాచారాన్ని తెలుసుకుని వారిని అక్కడి నుంచి తీసుకువచ్చేలా చూడాలని ప్రభుత్వానికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశాను. వలస కూలీలను పంపేందుకు సహకరించాలని ముంబాయి (నార్త్) ఎంపీ గోపాల్ శెట్టి గారిని కూడా కోరాను. వారంతా స్పందించారు. మరో రెండు, మూడు రోజుల్లో వలస కూలీలందరిని ముంబాయి నుంచి ఆదోనికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎక్కడైనా వలస కూలీలు ఇబ్బందులు పడుతుంటే నా దృష్టికి తీసుకురండి. వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా. అలాగే పంజాబ్ లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఏపీకి చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో కొందరు నాకు ఫోన్ చేసి వారి సమస్యలు చెప్పారు. వెంటనే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారిని ఇటీవల విజయవాడ తీసుకువచ్చి క్వారంటైన్‌కు తరలించారు. మా కుటుంబ సభ్యుల్లో ఆరుగురు కరోనా వైరస్ బారినపడ్డ విషయం మీకు తెలిసిందే. వారంతా కోలుకున్నారు. మా నాన్నగారి వయసు 83 సంవత్సరాలు. ఆయన దాదాపు 10 రోజుల పాటు వెంటిలేటర్‌ఫై ఉన్నారు. ప్రస్తుతం కోలుకున్నారు. కరోనా గురించి ఎక్కువగా ఆందోళన చెందనవసరంలేదు. తొలి దశలోనే గుర్తించి ట్రీట్‌మెంట్ చేయించుకుంటే కరోనా నుంచి సులభంగా కోలుకోవచ్చు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. అలాగే కర్నూలు రెడ్‌జోన్‌లో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తా’’ అని ఎంపీ అన్నారు. Ascenso Finviora

