హైదరాబాద్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి(Sep 27) వర్ధంతి(Sep 21)ని పురస్కరించుకుని.. ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు సామాజిక తెలంగాణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి పెద్ది జగదీష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం సమీపంలోని బాపూజీ విగ్రహం వద్ద సెప్టెంబర్ 21, 27వ తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యమ నాయకులు, కవులు, కళాకారులు, కుల సంఘాల నాయకులు పాల్గొంటారని తెలిపారు.
‘బాపూజీ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం..’

‘‘రాజకీయ పార్టీలకు అతీతంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే అన్ని పార్టీల ముఖ్యనేతలకు, వివిధ సామాజిక వర్గ నేతలకు, ఉద్యమకారులకు, పద్మశాలీ ప్రముఖులను ఆహ్వానించాం. వాళ్లు కూడా హాజరవుతామని చెప్పారు. వారోత్సవాలను పురస్కరించుకుని ప్రతి జిల్లాల్లోనూ బాపూజీ వారోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాపూజీ భావాజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడం.. కొండా లక్ష్మణ్ విగ్రహాలు ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేయడం. బీసీ కులాలతో మమేకమై రాజ్యాధికారానికి కృషి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.’’
– రాపోలు జ్ఞానేశ్వర్, కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ చైర్మన్.
బాపూజీ గురించి క్లుప్తంగా..
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిది. మూడు తరాల ఉద్యమానికి ఆయన ప్రత్యక్ష సాక్షి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం 1969లోనే మంత్రి పదవిని సైతం త్యజించిన మహనీయుడు కొండా లక్ష్మణ్.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో కొండా పోశెట్టి, అమ్మక్కలకు 1915 సెప్టెంబరు 27న జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ.. ప్రాథమిక విద్యాబ్యాసం ఆసిఫాబాదులో జరిగింది. న్యాయశాస్త్ర విద్యను హైదరాబాదులో పూర్తిచేశారు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు. నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ విముక్తి పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు.

రాజకీయ జీవితం..
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ నుంచి 1952లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1967,1972లో భువనగిరి నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా, దామోదరం సంజీవయ్య క్యాబినేట్‌లో ఎక్సైజ్, చేనేత, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా, బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో కార్మిక, సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత సీఎం పదవికోసం పీవీ నరసింహారావుతో పోటీపడ్డారు. ఆ పదవి దక్కలేదు. గవర్నర్‌గా నియమిస్తామని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇచ్చిన అవకాశాన్ని బాపూజీ సున్నితంగా తిరస్కరించారు.

1969లో మొదలైన తొలి దశ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచి.. మంత్రి పదవికి సైతం త్యజించారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పటి బీఆర్ఎస్) పార్టీ ఏర్పడినప్పుడు.. తన ఇంటినే పార్టీ కేంద్ర కార్యాలయంగా వాడుకోమని ఇచ్చేసిన త్యాగశీలి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారులతో ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష, ఢిల్లీలో జంతర్‌మంతర్‌లో సత్యాగ్రహ దీక్ష.. బాపూజీ పోరాట స్ఫూర్తికి నిదర్శనం. 97 ఏళ్ల వయసులో 2012 సెప్టెంబరు 21న ఆయన కన్నుమూశారు. బాపూజీ భార్య శకుంతల. కొండా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. ఒక కుమారుడు భారత వైమానిక దళంలో పనిచేస్తూ వీరమరణం పొందారు.

హైదరాబాదులోని జలదృశ్యంలో ఏర్పాటుచేసిన 15 అడుగుల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని 2022 సెప్టెంబరు 27న తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించాడు.

వివిధ జిల్లాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్థంతి కార్యక్రమ వివరాలు, ఫొటోలను సెల్ నెం. 83338 71117కు పంపగలరని మనవి. ఈ పోస్టును వివిధ పద్మశాలీ గ్రూపుల్లో షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. మీ.. Cresta Valtrion


